తమ పార్టీ పుట్టుకతోనే జాతీయ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో దేశమంతా పోటీ చేస్తుందా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను 175కు 175 స్థానాలలో పోటీ చేయాలన్న జగన్ మోహన్ గారు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తన జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీనే అని, తాను ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడినేనని అంగీకరిస్తే అది వేరే విషయం అన్నారు. అంతేకానీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ, కేవలం ఒక రాష్ట్రంలోనే పోటీ చేస్తామంటే అది ఆత్మ న్యూనత భావమే అవుతుందని, సింహతత్వం అనిపించుకోదని అన్నారు.
ఇక తెనాలికి హెలికాప్టర్లో వెళ్లడం వెనుక చెట్లపై తమకున్న ప్రేమే కారణమని, వృక్షాలను నరికించడం ఇష్టం లేకే జగన్ మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్లారని రఘురామకృష్ణ రాజు గారు అపహాస్యం చేశారు. విశాఖ పారిశ్రామికవేత్తల సదస్సు కు విజయసాయిరెడ్డి గారు హాజరైనప్పటికీ ఆయనతో ఎవరూ పెద్దగా మాట్లాడినట్లు కనిపించలేదని, చివరకు విశాఖపట్నం ఇన్చార్జి మంత్రి విడదల రజినీ గారు వెనక్కి నిలబడ్డ ఆయన్ని కాసింత ముందుకు రమ్మని చెప్పినట్లుగా కనిపించిందని అన్నారు. రంగులరాట్నంలో ఇదంతా ఒక భాగమేనని, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వంతు వచ్చిందని రఘురామకృష్ణ రాజు గారు వ్యాఖ్యానించారు.