వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన గనుల దోపిడీ పై గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు కూడా కదలాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పేర్కొన్నారు. ఆ పెద్ద డొంకా ఏ ప్యాలెస్ లో ఉన్నా.. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్ెపడిన ఘనుడు వెంకట్ రెడ్డి అయితే.. తెర వెనుక ఉండి సర్వం తానై.. వేల కోట్లు కాజేసిన ఆ ఘనపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు.
ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకొని తిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని.. టెండర్లు, ఒప్పందాలు నిబంధలన్నీ బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. SGT నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ కుంభకోణం పై ఏసీబీ విచారణతో పాటు.. పూర్తి సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.