తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. స్వామి వారి దర్శనానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని చెప్పారు. శనివారం రోజున శ్రీవారిని 77,995 మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. 30,250 మంది భక్తులు వేంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించారని తెలిపారు. శనివారం రోజున తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు జులై 9, 16వ తేదీన రెండు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో జులై 9వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం .. 16వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని జరపనున్నారు. ఈ రెండిటినీ పురస్కరించుకుని జులై 9, జులై16న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.