ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 237 మంది మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా..? అన్నదానిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దించారు. అమర్నాథ్ రైలు ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. ఆయన వెంట స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్, ప్రభుత్వం నుండి మరికొంతమంది సభ్యులు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కిన వారిలో 178 మంది తెలుగువారు ఉన్నారని తెలిపారు. ప్రమాద ఘటనలో మృతులు, గాయపడ్డ వారు, మిస్సింగ్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్ లోకి వచ్చారని తెలిపారు. ఇక విశాఖలో దిగేవారు 110 మంది, రాజమండ్రిలో దిగేవారు 26 మంది, తాడేపల్లి గూడెంలో ఒకరు, ఏలూరులో ఇద్దరు ఉన్నారని తెలిపారు.