చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల విషయంలో ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేసారు. అయినా సరే ఇప్పటి వరకు మాత్రం ఏ ఆధారం స్పష్టంగా దొరకలేదు అని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇక వారిని మదనపల్లె నుంచి విశాఖపట్నం తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చూడగా ఎస్కార్ట్ అందలేదు అని అంటున్నారు. జైలు నుంచి రెండుసార్లు రేడియో మెసేజ్ పంపినా సరే ఏ ఆర్ పోలీసులు స్పందించలేదు.
జైలులో బిడ్డలను తలచుకుని పురుషోత్తం నాయుడు కుమిలి ఏడుస్తున్నారు అని అధికారులు పేర్కొన్నారు. అయితే తల్లి పద్మజ మాత్రం ధ్యానం చేస్తుంది అని అధికారులు వివరించారు. వీరిద్దరిని కలిసేందుకు (ములాఖాత్) హైకోర్టు న్యాయవాది రజని ప్రయత్నాలు చేసారు. నేడు ముద్దాయిలతో ములాకాత్ కు అవకాశం ఉందని అంటున్నారు. పద్మజ ని చూసి జైలులోని మహిళా ఖైదీలు కలవరం చెందుతున్నారు.
ఒంటరిగా కాకుండా తోటి మహిళా ఖైదీలతో కలిపి ఉంచడానికి జైలు అధికారులు సాహసం చేయడం లేదు. పద్మజ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు ఆమెను వేరే గదిలో పెట్టిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. విశాఖపట్నం మానసిక వైద్యశాల కు తరలించాలని వైద్యులు సూచించినా సరే ఇంతవరకు ప్రయత్నాలు ఫలించలేదు.