జగన్ పాలనలో మండలానికి ఓ భూ కుంభకోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….వినతులు ఎన్ని ఉన్నా. అన్నిటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు చంద్రబాబు.
రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని వివరించారు. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని చెప్పారు. రికార్డులు కూడా తారుమారు చేశారని… రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని… రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అన్నారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని చెప్పారు సీఎం చంద్రబాబు.