వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. “వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్టు లేదు. కళ్లకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్టు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు గారు కనిపించడం చాలా బాధాకరం. ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యింది.
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడింది” అంటూ సంచలన ట్వీట్ చేశారు.