కన్నతండ్రిపై దారుణంగా దాడి చేశాడు ఓ కుమారుడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని ప్రియురాలికి వీడియో కాల్ చేసి చూపించాడు. ఈ అమానవీయ ఘటన ఆదివారం సాయంత్రం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది.
స్థానికంగా నివసిస్తున్న దిల్లీబాబు హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు భరత్(21) మూటలు మోసే కూలీ. కొద్దిరోజుల కిందట నగరంలోని ఓ కాలనీకి చెందిన ఓ మహిళ(39)తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. దీన్ని గుర్తించిన తండ్రి అతడిని తీవ్రంగా మందలించాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిత్తూరు రెండో పట్టణ పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపారు.
అయితే ఆదివారం భరత్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన తన తండ్రిపై దాడి చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా వీడియోలో చూపుతూ తండ్రిని కొట్టాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో దిల్లీబాబుకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. దీనిపై చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.