నెల్లూరు రాజకీయం రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సొంత పార్టీపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో వైసీపీ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత నుంచి తప్పించిన వైసీపీ అధిష్ఠానం.. తాజాగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేటు వేసింది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో వైసీపీ అగ్రనాయకత్వం రూరల్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఇన్‌ఛార్జి నియామకం కోసం పలువురు పేర్లను అధిష్ఠానం పరిశీలించినప్పటికీ.. చివరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో నెల్లూరు నగరంలోని ఆదాల నివాసం వద్ద వైకాపా కార్యకర్తల సందడి నెలకొంది.