ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు ఇక ఆ భయం లేనట్లే…!

-

పోర్ట్ సిటీ విశాఖకు అమ్మోనియ నైట్రేట్ భయం శాశ్వతంగా తొలగిపోనుంది. ప్రమాదకరమైన రసాయనాల నిల్వల ముప్పు తప్పించేందుకు కొత్త ఆలోచన తెరపైకి వచ్చింది. ఇక నుంచి షిప్పుల నుంచి దిగుమతైన అమ్మోనియం నైట్రేట్ నేరుగా గమ్యస్ధానాలకు చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్‌.

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు తర్వాత పోర్ట్ సిటీ విశాఖలో భద్రతపై అనేక భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దేశంలో ఈ ప్రమాదకరమైన రసాయనం దిగుమతి చేసుకుంటున్న ఏకైక పోర్టు విశాఖనే. ఇక్కడ ఏటా రెండున్నర లక్షల టన్నుల అమ్మోనియం దిగుమతి అవుతుంది. కనీసం 50వేల టన్నుల నిల్వలు ఎప్పుడూ గోదాముల్లో వుంటాయి. అమ్మోనియం నైట్రేట్ దిగుమతులు, రవాణా జరుగుతున్నప్పటికీ నిల్వలు, నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రంగంలోకి దిగిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసులు నిబంధనలు పాటించడంలో డొల్లతనాన్ని గుర్తించారు. వీటన్నింటి ఆధారంగా నగరం నడిబొడ్డున అమ్మోనియం నిల్వలు ఏమాత్రం శ్రేయస్కరం కాదనే నిర్ణయానికి వచ్చారు. అదేసమయంలో విశాఖకు మూడు షిప్పుల్లో సుమారు 45వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ చేరుకుంది. గోదాముల నిర్వహణకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో సుమారు నెలన్నరగా ఇవి అవుటర్ హార్బర్లోనే వుండిపోయాయి. బ్లాస్టింగ్ మెటీరియల్‌గా వినియోగించే అమ్మోనియం నైట్రేట్ నిల్వలు తగ్గడంతో దీనిపై ఒక పరిష్కారం కనుగొనాలని దిగుమతిదారులు విశాఖ పోర్ట్‌ట్రస్ట్‌ను అభ్యర్ధించారు.ఈ తరుణంలో అమ్మోనియంను నిల్వ చేయకుండా షిప్పుల నుంచి వచ్చినది వచ్చినట్టుగా ఎండ్ పాయింట్‌కు రైళ్ళు, ట్రక్కుల ద్వారా తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అభ్యంతరాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. పైగా ఎప్పటికప్పుడు నేరుగా షిప్పుల నుంచే తరలిపోతుంది కాబట్టి నగరం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news