రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో విజయవాడను వరద ముంచిన విషయం తెలిసిందే. ఇక ఈ వరదల్లో లక్షలు విలువ చేసే వాహనాలు పనికిరాకుండా పోయాయి. అయితే వరదలో మునిగిన వాహానాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాసేపట్లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. వరదల్లో భారీ ఎత్తున టూవీలర్, ఫోర్ వీలర్లు నీట మునిగాయి. లక్షల సంఖ్యలో వాహానాలు నీట మునిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు.
అయితే వాహానాల రిపేర్లకే ఒక్కో కుటుంబానికి వేలల్లో ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. వరద బాధితుల భారం తగ్గించేందుకు చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలతో సీఎం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్న వాహానాలెన్ని..? ఇన్సూరెన్స్ లేని వాహానాలు ఎన్ని..? అనే అంశంపై లెక్కలు తీయనుంది ప్రభుత్వం. ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను పక్కన పెట్టాలని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరనుంది ఏపీ ప్రభుత్వం. వరద పరిస్థితి అర్థం చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలు మానవతా ధృక్ఫధంతో ఆలోచించాలని చంద్రబాబు కోరనున్నారు.