ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం!

-

ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.

తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్‌ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను రూ.20 కోట్లతో పుర, నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news