ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. టూర్ పై ఉత్కంఠ..!

-

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. అయితే ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.  అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్.. రానున్న ఎన్నికల్లో తమ జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉంటుందని ప్రకటించడం.. వంటి పరిణామాలు ఏపీ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. 

అయితే పొత్తుల విషయంలో బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక, తాజాగా పురందేశ్వరి నేతృత్వంలోని ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొత్తులకు సంబంధించిన పార్టీ నాయకుల అభిప్రాయలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ కూటమితో కలిసి వెళ్లేందుకు కొందరు అనుకూలంగా మాట్లాడగా.. మరో వర్గం మాత్రం ఆ చర్చను తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇచ్చే వరకు పొత్తులపై స్పందించవద్దని పురంధేశ్వరి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ అధిష్టానం హస్తం ఉందని కొందరు టీడీపీ  నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Latest news