2022-23 వార్షిక బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ కాసేపటి క్రితమే ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సామాజిక ఆర్ధిక సర్వే 2021-22 విడుదల చేసారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అనంతరం ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సామాజిక ఆర్థిక సర్వే 2021 -22లో జీఎస్‌డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని చెప్పారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో ఏపీ దేశ సగటు రేటు దాటిందని.. వ్యవసాయ రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు చేసిందని చెప్పారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. పరిశ్రమల రంగగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు చేసిందని.. తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి 17.5 శాతం పెరిగిందన్నారు. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగిందని వెల్లడించారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని.. గతంలో కంటే ఇప్పటి పరిస్థితి చాలా మెరుగయ్యాయి అని ఆయన వివరించారు.