మిగ్జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని.. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు బాగా పనిచేశారని సీఎం ప్రశంసించారు.
తుపాను సహాయక చర్యలపై ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడిన జగన్.. తుపాను బాధితులకు సాయం విషయంలో ఎలాంటి లోటూ రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సానుభూతితో వ్యవహరించి.. వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10 వేలు ఇవ్వడం, ముంపు బారిన పడిన లోతట్టు ప్రాంతాల పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి సాయం, రేషన్ పంపిణీలో ఎలాంటి లోటూ రాకూడదని చెప్పారు.
పొలాల్లో వరద నీటిని తొలగించడంపై దృష్టి పెట్టాలని.. పంటల రక్షణ, పరిహారం, తడిసిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ అన్నారు. 80% రాయితీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ‘విద్యుత్తు, రహదారుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.