ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది విద్యుత్ శాఖ. ప్రస్తుతం ఏపీలో ఉన్న విద్యుత్ ఇబ్బందులు తాత్కాలికమేనని ప్రకటన చేశారు ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్. గృహ, వ్యవసాయ వినియోగానికి ఆటంకాలు కలగకూడదనే పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించామని… ప్రస్తుతం ఏపీలో 230 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ఏపీలో 180 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని.. పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షల వల్ల 20 మిలియన్ యూనిట్ల మేర భారం తగ్గుతుందని చెప్పారు. పరిశ్రమల్లో ఆంక్షలు విధించినా.. మరో 30 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని.. ఏప్రిల్ చివరి వారం వరకు విద్యుత్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
మరీ అవసరమైతే తప్ప.. గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోతలు విధించబోమని.. తప్పదనుకుంటే రూరల్ ప్రాంతాల్లో ఓ గంట సేపు.. అర్బన్‌లో అరగట సేపు విద్యుత్ కోతలు విధిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉందని.. ఏపీలోని థర్మల్ పవర్ ప్లాంట్లల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు కొరత ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించారు. గతంలో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేవి.. ఇప్పుడు నిల్వలు లేవని.. కానీ ఇప్పుడు ఏ రోజుకారోజు బొగ్గు తెచ్చుకుంటూ.. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకుంటున్నామన్నారు.