ఏపీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యకు సంబంధించి ఆ రాష్ట్ర విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా కొవిడ్ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుడడంతో 11 పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.