ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాధి అదుపులోకి రావట్లేదు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అధికారులు ప్రజలకి మాస్కు ధరించమని ఎన్నిసార్లు చెప్పినా వాటిని పెడచెవిన పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.
అయితే ఈ విషయంపై పలు రాష్ట్రాలు ఇప్పటికే కఠినంగా నిబంధనలను పాటిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిని గుర్తించి ఏకంగా కోటి రూపాయలను వసూలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంది. బయటకు వచ్చే వారు ఖచ్చితంగా మాస్కు ధరించి రావాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో, పనిచేసే స్థలాలలో, ప్రయాణం చేసే సమయంలో కచ్చితంగా మాస్కు ధరించాలని లేకపోతే తగు చర్యలు చేపట్టేటట్లు అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.