ఏపీ రాష్ట్రానికి నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఇతర అధికారులతో పాటు ఈ పాలసీ విడుదల చేశారు. 2020-2023 వరకు అమలులో ఉండనున్న ఈ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. అంతే కాక వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ఈ పాలసీలో ప్రాధాన్యత ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో పారిశ్రామిక విధానం వచ్చే మూడేళ్లకే రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఇక కొత్త పాలసీ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉందని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తెలిపారు. ఇక ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.