దేశవ్యాప్తంగా అమలవుతున్న జల్ జీవన్ మిషన్ పథకం అమల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 18వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కొళాయి నీటి సౌకర్య కల్పనకు కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు గోవా, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్‌హవేలీ దామన్ దయ్యూ, హరియాణా, గుజరాత్, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణలు గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లకు కొళాయినీటి సౌకర్యం కల్పించి తొలి 8 స్థానాల్లో నిలిచాయి.
ఆ తర్వాతి స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్ (98.35%), బిహార్ (96.05%), మిజోరం(85.57%), సిక్కిం (83.95%), అరుణాచల్‌ప్రదేశ్ (77.53%), ఉత్తరాఖండ్ (77.19%), మణిపుర్ (76.58%), మహారాష్ట్ర (75.84%), లద్ధాఖ్ (72.29%), ఆంధ్రప్రదేశ్ (69.74%)లు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 95,54,758 ఇళ్లకు గాను ఇప్పటి వరకు 66,63,121 ఇళ్లకు కొళాయినీటి సౌకర్యం కల్పించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి సగటున 61.71% ఇళ్లకు ఈ పథకం చేరుకుందని తెలిపింది.