జగన్ ప్రభుత్వానివి పిట్టల దొర కోతలే

-

విజయవాడ: వైఎస్పార్ జగనన్న ఇళ్ల పథకానికి సీఎం జగన్ ఈ రోజే శ్రీకారం చుట్టనున్నారు. ఇంకా ప్రారంభించనే లేదు. అప్పుడే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం  చెబుతున్న లెక్కల్లో తప్పులు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వానివి పిట్టల దొర కోతలేనని అన్నారు.  ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం ఇచ్చేది రూ.1.80 లక్షలేనని ఆయన చెప్పారు.

ఇసుక సిమెంట్, స్టీల్, కూలి ధరలు పెరిగిన కారణంగా ఒక్కొక్క ఇంటికి కనీసం రూ.3.50 లక్షలవుతుందని తులసిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి రూ.3.50 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు. జగన్ సర్కార్ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.3 వేల 671 కోట్లు కేటాయించి రూ.964 కోట్లు (27 శాతం) ఖర్చు చేసిందని చెప్పారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3,692 కోట్లు కేటాయించి రూ.1,510 కోట్లు (41 శాతం) ఖర్చు చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2021-2022 బడ్జెట్ లో రూ.4,715 కోట్లు మాత్రమే కేటాయించిందని వ్యాఖ్యానించారు. కానీ ఈ రోజు ప్రకటనల్లో 2022 జూన్ నాటికి రూ.28,084 కోట్లతో 15,60,227 ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పిందని, బడ్జెట్ కేటాయింపులే రూ.4,715 కోట్లు కాగా, రూ.28,084 కోట్లు ఖర్చు చేస్తామనడం పిట్టల దొర కోతలు కాదా..? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news