బాబు తీర్ధయాత్రలు, లోకేష్ శవయాత్రలు చేస్తున్నారు : మంత్రి అప్పలరాజు

రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి దేవాలయాలపై వరుసగా దాడుల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేయడం టీడీపీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని విమర్శించారు ఆయన. చంద్రబాబుకి వయసు మీద పడుతున్న కొద్దీ అధికారం మీద వ్యామోహం పెరిగి దేవుడితో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చేస్తూ మతం అడ్డుపెట్టుకొని చంద్రబాబు అధికారం కోసం పాకులాడు తున్నారని, రామతీర్థం ఘటనలో డబ్బులిచ్చి మరి చంద్రబాబు అరాచకం సృష్టించారని మండిపడ్డారు.

తండ్రి తీర్ద యాత్రల పేరిట రాజకీయాలు చేస్తుంటే కొడుకు శవ రాజకీయాలు చేస్తున్నాడుంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ పథకాలు అమలు పరిచే రోజున ఏదో ఒక విధ్వంసం సృష్టించి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి, మతం పేరుతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఇలాంటి మనిషి ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.