శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్‌.. కుప్పకూలిన అరబిందో ఫార్మా షేరు

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. శరత్ చంద్రారెడ్డి అరెస్టు స్థానిక కార్పొరేట్‌ వర్గాల్లో, స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టు ప్రభావం అరబిందో ఫార్మా షేరు ధరపై కనిపించింది.

కొంతకాలంగా అరబిందో ఫార్మా షేరు స్టాక్‌ మార్కెట్లో మదుపరులను పెద్దగా ఆకర్షించడం లేదు. గరిష్ఠ ధర అయిన రూ.900 నుంచి గత ఏడాదిన్నర కాలంలో ఈ షేరు విలువ బాగా పతనమైంది. గత మూడు నెలలుగా రూ.550- 575 శ్రేణిలో ట్రేడ్‌ అవుతోంది. శరత్‌ చంద్రారెడ్డి అరెస్టు కాగానే, గురువారం అరబిందో ఫార్మా షేరు ఒక్కసారిగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో బుధవారం ముగింపు ధర రూ.541 కాగా, గురువారం 11.69 శాతం (రూ.63.30) నష్టపోయి రూ.478.10 వద్ద స్థిరపడింది. బుధవారంతో పోల్చితే దాదాపు రూ.3,700 కోట్ల మార్కెట్‌ విలువను ఈ కంపెనీ కోల్పోయింది.

శరత్‌చంద్రారెడ్డి అరెస్టుపై అరబిందో ఫార్మా వివరణ ఇచ్చింది. శరత్‌ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మా కార్యకలాపాలతో కానీ, దాని అనుబంధ కంపెనీల కార్యకలాపాలతో కానీ సంబంధం లేదని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయన కంపెనీ బోర్డులో హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news