టీవీ చానళ్లకు కేంద్రం హుకుం.. 30 నిమిషాల పాటు జాతీయ ప్రాముఖ్య వార్తలు

-

కేంద్రంలోని మోదీ సర్కారు టీవీ చానళ్లను ఆధీనంలోకి తీసుకొనేలా వ్యవహరిస్తున్నది. ఏది ప్రసారం చేయాలో, ఏది ప్రసారం చేయకూడదో నిర్ణయిస్తున్నది కేంద్రం. దేశంలోని టీవీ చానళ్లన్నీ ప్రతి రోజు 30 నిమిషాల పాటు జాతీయ ప్రాముఖ్య వార్తలను ప్రసారం చేయాలని హుకుం జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ అప్‌లింకింగ్‌, డౌన్‌లింకింగ్‌ మార్గదర్శకాలను వెలువరించింది. ఆ 30 నిమిషాల పాటు విద్య, అక్షరాస్యత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మహిళల సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమం వంటి అంశాలపై కథనాలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. సమాజంలోని విభాగాలు, పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ సమైక్యత అంశాలకు కూడా చోటు కల్పించాలని స్పష్టం చేసింది. అయితే, ఆ సమాచారాన్ని ప్రభుత్వం అందించబోదని, టీవీ చానళ్లే సేకరించుకోవాలని వివరించింది కేంద్ర ప్రభుత్వం.

Does NTO 2.0 jeopardise the future of niche channels? - Exchange4media

ఈ నిబంధన స్పోర్ట్స్‌, వైల్డ్‌ లైఫ్‌, విదేశీ చానళ్లకు వర్తించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అటు.. టీవీ చానళ్లకు అప్‌లింకింగ్‌, డౌన్‌లింకింగ్‌లో ఉన్న కొన్ని నిబంధనలను సడలించింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ చానళ్లతో భారతీయ టెలిపోర్టుల అప్‌లింక్‌కు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు దీనిపై నిషేధం ఉండేది. అదేవిధంగా, న్యూస్‌ సంబంధం లేని ఈవెంట్ల లైవ్‌ టెలికాస్ట్‌కు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్గదర్శకాలను తొలుత 2005లో జారీ చేశారు. అనంతరం 2011లో సవరించారు. దాదాపు 11 ఏండ్ల తర్వాత ఇప్పుడు.. పలు నిబంధనలను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కాగా, చానళ్లలో తాము చెప్పిన అంశాలే ప్రసారం చేయాలని కేంద్రం ఆదేశించటంపై మీడియా వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇది మీడియా స్వేచ్ఛను హరించటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news