ఆంధ్రప్రదేశ్ లో చాలా విచిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. సొంత ఇంట్లోనే శతృవులపై ప్రభుత్వం యుద్ధం చేయాల్సి వస్తుండటం చాలా చిత్రమైన పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ శక్తిమంతుడిపై యుద్ధం చేయాలంటే చాలా వ్యూహం కావాలి.. అలా ఇప్పట్లో రఘురామ కృష్ణంరాజుకు సాధ్యమయ్యే పని కాదనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఇంతకు ముందు ప్రజల్లోకి వచ్చి స్వయంగా అధికార పార్టీపై యుద్ధంవంటి మాటల తూటాలను పేల్చిన నాయకులు డైల్యూట్ అయిన విషయాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే తరహాలో ఆర్.ఆర్.ఆర్. వ్యవహారం కూడా అవుతోంది అనేది గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా ప్రతి విషయంలోనూ ఏపీ అధికార పార్టీపై అదే పార్టీకి చెందిన ఎంపీ ఆర్.ఆర్.ఆర్. దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకు ధీటుగానే ఆ పార్టీకి చెందిన నేతలు బదులిస్తున్నారు. అందుకోసం కోర్టుల ఉన్నాయమంటూ యాక్ట్ లతో కుస్తీలాంటి బట్టీ వాక్యాలను వల్లెవేస్తూ ఆర్.ఆర్.ఆర్. నిత్యం పచ్చమీడియాలో వైసీపీ ప్రభుత్వంపై వెటకార ధోరణిలో ధ్వజమెత్తుతున్నారు. అదే పంథాలో తాజాగా ఆర్.ఆర్.ఆర్… మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ మృతి చెందిన విషయంపై కూడా పోలీస్ హత్యగా భావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తనదైన శైలిలో స్పందించారు.
సీఎం వైఎస్ జగన్ భిక్షతో రఘురామకృష్ణరాజు ఎంపీ అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపిన ఆయన.. జగన్ వల్లే జనసేన నేత నాగబాబుపై ఆయన గెలుపొందారని అవంతి తేల్చి చెప్పారు. ఎంపీగా గెలిపించిన సీఎంపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజు టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తుండటం బాధాకరమని.. ఏపీ రాజధానిగా విశాఖ వద్దని చెప్పడానికి ఆయన ఎవరని అవంతి శ్రీనివాస్ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే చంద్రబాబు నాయుడిని విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్న విషయాన్నిగుర్తుచేశారు.
అంతేకాకుండా వైసీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రఘురామకృష్ణం రాజు రాజీనామా చేయాలని అవంతి తెలిపారు. కాగా నలంద కిశోర్ అనారోగ్యంతో మృతి చెందారని, ఆయన మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అవంతి విమర్శించారు.