మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4.30 గంటల పాటు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అవినాష్ వెంట వచ్చిన న్యాయవాదులను అధికారులు లోపలికి అనుమతించలేదు. లాయర్లను అనుమతించి ఆడియో.. వీడియో రికార్డు చేయాలని సీబీఐను కోరినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. ఇవాళ జరిగిన విచారణ రికార్డు చేసినట్లు లేదని చెప్పారు. ఇవాళ విచారణ అనంతరం మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు ఏమీ చెప్పలేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను వైఎస్ విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే.. ఆమెను నేను బెదిరించి వచ్చినట్లు టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెట్టి అసత్య ప్రచారం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరుతున్నా. సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా. హత్య జరిగిన రోజు నేను వెళ్లే సరికి ఘటనా స్థలంలో లేఖ ఉంది.. అది ఎందుకు దాచారు? ఇవాళ లాయర్లను అనుమతించి ఆడియో.. వీడియో రికార్డు చేయాలని కోరాను. ఇవాళ జరిగిన విచారణ రికార్డు చేసినట్లు లేదు. ’’ అని అవినాష్ రెడ్డి వెల్లడించారు.