అప్లై అవుతుందా: కేసీఆర్, ఎన్టీఆర్ ఫ్యాన్… జగన్, బాలయ్య ఫ్యాన్!

-

రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ విషయాలు వేరు అని బాలయ్య తాజాగా తేల్చేశారు. రాజకీయాలు అన్న తర్వాత సవాలక్ష మాటలు, చేతలు ఉంటాయని.. కానీ సినిమా ఇండస్ట్రీ విషయాల్లో అంతా కలిసి ఉండాలి అన్నట్లుగా బాలయ్య ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టాలీవుడ్ పెద్దలు కలిసిన విషయం తనకు తెలియదని బాలయ్య చెప్పడం, అనంతరం ఇండస్ట్రీలో కాస్త అలజడి రావడం అయిన తర్వాత! దీంతో చిరు & కోకు బాలయ్య మరో క్లారిటీ ఇచ్చినట్లే అయ్యింది!

సినిమా ఇండస్ట్రీ పెద్దలు కేసీఆర్ ను కలవడం.. ఆ మీటింగ్ కు బాలయ్యను పిలవకపోవడం, అనంతర పరిణామాలపై బాలయ్య తాజాగా స్పందించారు. కేసీఆర్ కు తనకు మధ్య విభేదాలు ఉన్నాయనే కారణంతోనే వారు తనను పిలవని పక్షంలో… ఆ విషయం ముందుగా తనకు చెప్పాలని సూచించారు. ఆ సంగతి అలా ఉంటే… రాజకీయాలు సినిమాలు పూర్తిగా వేరని, తాను గతంలో కేసీఆర్ పై రాజకీయంగా విమర్శలు చేసినా వాటిని కేసీఆర్ మనసులో పెట్టుకుని ఉండరని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉదాహరణగా… నామా నాగేశ్వర రావు గతంలో కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేసినా కూడా నేడు పార్టీలో చేరాడన్న విషయాన్ని గుర్తుకు చేస్తున్నారు బాలయ్య. పైగా కేసీఆర్ కు తనపై పుత్రవాత్సల్యం ఉందని చెబుతున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… అన్నీ అనుకూలంగా జరిగితే జూన్ రెండో వారంలో చిరు ఆధ్వర్యంలో టాలీవుడ్ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే గనుక మరో వారం, పదిరోజుల్లో ఈ మీటింగ్ ఉండొచ్చు! అయితే… జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ మీటింగ్ కు చిరు & కో, బాలయ్యను కచ్చితంగా పిలిచి తీరుతారనే అనుకోవాలి. అయితే ఈ ఆహ్వానాన్ని మన్నించి బాలయ్య… జగన్ దగ్గరకు వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. కేసీఆర్ పై అప్లై చేసిన లాజిక్ నే గనుక జగన్ పై కూడా అప్లై చేస్తే… బాలయ్య కచ్చితంగా ఈ మీటింగుకు హాజరై తీరుతారు. ఎందుకంటే… కేసీఆర్ ఎలాగైతే రామారావు గారి అభిమానో, జగన్ కూడా బాలయ్యకు అప్పట్లో అభిమానే!

అలా కాకుండా ఇండస్ట్రీ కోసమైనా జగన్ ను కలిసే విషయంలో చంద్రబాబు వల్ల సమస్య వస్తాది అనుకుంటే కేసీఆర్ పై అప్లై చేసిన లాజిక్ జగన్ దగ్గర చెల్లదు! మరి దానిపై బాలయ్య ఎలాంటి లాజిక్స్ మాట్లాడతారో వేచి చూడాలి! సరే బాలయ్యను పంపడం, పంపకపోవడం బాబు ఇష్టం.. వెళ్లడం, వెళ్లక పోవడం బాలయ్య ఇష్టం… కానీ పిలవాల్సిన బాధ్యత అయితే మాత్రం చిరుపై ఉంది సుమా!

Read more RELATED
Recommended to you

Latest news