రాజ్యాంగంలోని అతి కీలకమైన న్యాయ వ్యవస్థపై అవినీతిపరులు దాడి చేస్తుంటే కేంద్ర పెద్దలు చూస్తూ ఊరుకుంటారా? అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. మూర్ఖుడు, అవినీతి పరుడు, అనాలోచనా పరుడైన జగన్మోహన్ రెడ్డి, తన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడికి దిగాడని ఆయన ఆరోపించారు. మోదీతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యాకే, వైసీపీ నేతలు న్యాయ వ్యవస్థపై, న్యాయ మూర్తులపై బరి తెగించారని అన్నారు.
అవినీతిపరుడిని ఉపేక్షిస్తే దేశానికే ప్రమాదమని కేంద్రపెద్దలు తెలుసుకోవాలన్న అయన మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు జగన్ తమతో ఏం చర్చించాడో, కేసులకు సంబంధించి ఆయనకు వారేమి అభయమిచ్చారో చెప్పాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్న నిప్పే కదా అని వదిలేస్తే, ఆ నిప్పు రేపు దేశాన్నే దహిస్తుందని మోదీ తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా, అవినీతిపరుడి పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని, అతని మనస్తత్వాన్ని కేంద్రానికి తెలియ చేయాలని అన్నారు. న్యాయవ్యవస్థపై దాడికి దిగితే, న్యాయమూర్తులు స్వేచ్ఛగా పనిచేయలేరని జగన్ భావిస్తున్నాడని, న్యాయవ్యవస్థపై దాడి చేయడమంటే, అది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడేనని ఆయన అన్నారు. ఖండాంతరాలు దాటిన జగన్మోహన్ రెడ్డి అవినీతిని దాచడం విజయసాయిరెడ్డి, అజయ్ కల్లం వల్ల అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.