పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు లేదని కేంద్రం ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని, ఇప్పటికే అధ్యయనం పూర్తయిందని కేంద్ర జలసంఘం సృష్టికరించింది. మరోసారి ఈ విషయంపై అధ్యయనం చేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ముంపు ముప్పు ఉంటుందంటూ కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
దీనిపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి వారి అనుమానాలు నివృత్తి చేయాలని, పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ ఓరా అధ్యక్షతన ఢిల్లీలో సాంకేతిక అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, ఒడిస్సా ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆశుతోష్ తదితరులు హాజరయ్యారు.