ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తానని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. నూతన ప్రభుత్వం చేపట్టిన తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. రూ.7,000 చొప్పున పింఛను అందజేయడమనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు.
గుంటూరు జిల్లా పెనుమాకలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన మంగళగిరి నియోజకవర్గం పెనుమాక చేరుకోగా.. ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నేను నిరూపిస్తా.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలన్నారు. వాటిని దాయకూడదు.. నా పాలనలో హడావిడి ఉండదు.. ప్రజలతో మమేకం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.