తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఎన్నికలు చూశామని.. ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని అన్నారు. ఏపీ చరిత్రలో 93 శాతం స్ట్రైకింగ్ రేట్ విజయం ఎప్పుడూ రాలేదని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో విజయం సాధించామన్న ఆయన.. 2003లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలైందని చెప్పారు. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డానని .. ఆ సమయంలో వెంకటేశ్వరస్వామే తనను కాపాడారని అన్నారు. రాష్ట్రానికి, జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
‘తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆరే. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలి. భారతీయుల్లో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి. భారతీయులు ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉంటే అందులో 30 శాతం తెలుగువారుండాలి. సంపద సృష్టించాలి.. పేదవాళ్లకు చేరాలన్నదే నా లక్ష్యం. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలి. ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం’ అని చంద్రబాబు వివరించారు.