ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఆర్డిఏ పరిధిలో ( కృష్ణాయపాలెం జగనన్న లేఅవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని వెంకటాయపాలెం చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం వెంకటపాలెంలోని సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించారు మంత్రి జోగి రమేష్, విడదల రజిని.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర అన్నారు. పేదలకు ఇళ్లు కట్టకూడదని పెత్తందార్లు ఒకవైపు.. పేదలకు ఇళ్లు కట్టిచూపిస్తానని పేదల పక్షాన సీఎం జగన్ ఒకవైపు నిలబడ్డారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేదల ఇళ్లకు అడ్డుపడ్డారని ఆరోపించారు. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు చెప్పారని అన్నారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఈ ప్రాంతానికి వచ్చి ఇళ్ళు కట్టుకోవడం నేరమా..? అని ప్రశ్నించారు జోగి రమేష్.
పెత్తందార్ల పక్షాన చంద్రబాబు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాడన్నారు. పెత్తందార్ల కోటలను బద్ధలుకొడుతున్నామని సగర్వంగా చెబుతున్నామన్నారు. 50వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టిస్తున్నామని గర్వంగా చెబుతున్నామని పేర్కొన్నారు. ఆరు నెలల్లో ఇళ్లు పూర్తి చేయబోతున్నామని.. గృహప్రవేశాలు చేసి జయహో జగనన్న నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగేలా చేస్తామన్నారు.