ఉచిత ఇసుకపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశాం. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. కానీ సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాలో తప్పకుండా నమోదు చేసుకోవాలి. ఇసుక కొరత సమస్యను అధిగమించడం కోసం రీచుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు కేటాయించడంపై అధికారులు సమీక్షించాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ పారదర్శకంగా పర్యవేక్షించాలి.
ఇక ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలి. అంతర్రాష్ట్ర ఇసుక సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా చెన్నై హైదరాబాద్ బెంగళూరు మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి. ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా ఎక్కడైనా దుర్వినియోగం చేసినట్లయితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.