సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు.
అనంతరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం.