ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో, సీపీ కాంతిరానా టాటా పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ.. దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి ఆలయాన్ని తీర్చి దిద్దుతాం. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ రేపు ఉదయం శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగదు. నాలుగంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నాం. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కొండ చర్యలు పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. నిరుపయోగంగా వదిలేసిన క్యూ లైన్లకు ర్యాంపు నిర్మించి ఉపయోగంలోకి తెస్తామని తెలిపారు.