ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ లేఖ

ప్రధాని మోడీకి మాజీ ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు అనాధగా మారిందని లేఖలో పేర్కొన్నారు కేవీపీ. పోలవరం ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమను ప్రదర్శిస్తుందన్నారు. 300 టీఎంసీ జలాలు వృధాగా సముద్రంలో కలిసి పోతున్నాయని లేఖలో వివరించారు.

ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి సరిపడినంత నిధులను సమకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 2014 లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2018 వరకు పూర్తి చేయాల్సి ఉందని.. దురదృష్టవశాత్తు ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించడమైనదని.. అలా ఎందుకు జరిగిందో, మీకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కే పూర్తిగా తెలుసన్నారు.

పార్లమెంటు ఆమోదించిన చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారన్నారు. 2018 వరకు పూర్తికావచ్చిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే ఐదేళ్లు జాప్యం అయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో జ్యోతిష్యులకు కూడా అంతుచిక్కడం లేదని ఏద్దేవా చేశారు కేవీపీ.