ఏపీలో ఇవాళ వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్ అయ్యారు. కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
అంతకుముందు.. తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇంకో ఘటనలో చంద్రగిరి మండల పరిధిలోని సి.మల్లవరం జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డుకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులోని ఇద్దరు ప్రయాణికిలు అప్రమత్తమై వెంటనే బయటకి రావడంతో ప్రాణాపాయం తప్పింది.