వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండటంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 లక్షల 63వేల 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2 లక్షల 88 వేల 189 మంది పురుషులు, లక్ష 75 వేల 645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హనుకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతితక్కువగా సిద్ధిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా వేసినందున.. ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి పెట్టనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం ఉండదు.