విజయవాడలో ఎంపీ కేశినేని నాని తమ్ముడినంటూ ఓ వ్యక్తి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హెచ్ ఆర్ ఎం ఫైనాన్స్ ఎండీ, గేట్ వే హోటల్ పార్ట్ నర్ నని చెబుతూ కేశినేని రమేశ్ అనే వ్యక్తి అమాయకులను బురిడీ కొట్టించాడు. ఇంటి పేరు ఒకటి కలిసి రావడంతో జనాన్ని బురిడీ కొట్టించాడు సదరు కేటు గాడు. గుంటూరులో నల్లపాడు స్థలం లో 3 కోట్ల రూపాయల ఋణం కోసం సేల్ డీడ్ చేస్తానంటూ దూడల ఋషికేశ్వర్ నుంచి 20 లక్షలు వసూలు చేశాడు. అతనికి కేశినేని రమేష్ 80 లక్షలు చెల్లని చెక్కు ఇచ్చి పరారయ్యాడు. దీంతో బాధితుడు బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో కూడా భవానీ గురుపీఠం భూమి అమ్మకం పేరుతో రమేష్ కోటి రూపాయలకు కొందరిని ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ రమేష్ అఖిల భారత భవానీ పీఠాన్ని సంప్రదించాడు. ఆ భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా వారి నుండి డబ్బులు తీసుకున్నాడు. అయితే 100 ఎకరాల భూమికి, రమేష్‌కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించిన ట్రస్ట్ నిర్వాహకులు అప్పట్లో కృష్టలంక పోలీసులు అశ్రయించారు. ఇవి కాక రమేష్‌పై ఇప్పటికే పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులున్నాయి.