అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికలకు ముందు ఎనిమిదేళ్ల పాటు మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. గత యేడాది ఎన్నికల్లో ఆయన మరోసారి తనకు అలవాటైన రీతిలోనే నియోజకవర్గం మారి విశాఖ నార్త్ నుంచి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. గంటా ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు ఎంతో ఇష్టమైన మంత్రి పదవి లేదు. పైగా ఆయన అధికార పార్టీలో కూడా లేరు. దీంతో గత దశాబ్దంన్నర కాలంగా ఎప్పుడూ లేనన్ని కష్టాలు ఇప్పుడు గంటాను వెంటాడుతున్నాయి.
గంటాకు ఎప్పుడూ విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పడమే ఇష్టం. ఇప్పుడు ఆయన శిష్యుడు.. ఆయనకన్నా జూనియర్ అయిన అవంతి శ్రీనివాసరావుతో పాటు ఇంతకన్నా జూనియర్ల పెత్తనమే అక్కడ నడుస్తోంది. ఇలాంటి రాజకీయాల్లో ఉండడం గంటాకు సుతరామూ ఇష్టం లేదు. వైసీపీలో ఆయన కండీషన్లకు అంతా ఓకే అయితే గంటా ఇప్పటికే పార్టీ మారిపోయి ఉండేవారు. పైగా జగన్ అక్కడ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో అధికారికంగా చేర్చుకోరు… ఎలాంటి పదవులు ఇవ్వరు.
పార్టీ మారినా పెత్తనం లేకపోయినా, పదవులు లేకపోయినా గంటా తట్టుకోలేరు. అందుకే ఆయన పార్టీ మార్పు వ్యవహారం ఇంకా నానుతూ వస్తోంది. బీజేపీలోకి వెళ్లినా అక్కడ చేసేదేం లేదు. ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. గట్టిగా నోరు తెరచి మాట్లాడితే ఆ వ్యాపారాలను ప్రభుత్వం ఉక్కుపాదం తప్పదు. ఇవన్నీ గంటాను చేష్టలుడిగి చేసేలా చేస్తున్నాయి. ఇక ఇటు సొంత పార్టీలో ఆయన ఉన్నారా ? లేదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర టీడీపీలో అచ్చెన్నాయుడు, బండారు, అయ్యన్నపాత్రుడు, సబ్బంహరి లాంటి వాళ్ల వాయిస్‌లే వినిపిస్తున్నాయి. గంటా నోరు మెదిపేందుకు కూడా ఇష్టపడడం లేదు. గంటా వ్యవహార శైలీతో విసిగిపోయిన చంద్రబాబు సైతం ఆయనకు ఇప్పుడే కాదు… రేపు పార్టీ గెలిచినా ప్రయార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో టీడీపీలో ఇక గంట ఎప్పుడూ మోగే పరిస్థితి లేదు. మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో మాత్రం ఆయన వేసే అడుగులను బట్టే ఉంటుంది.