ఎప్పటినుంచో గ్యాస్ లీక్ సమస్య గోదావరి జిల్లాలకు అందునా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు అధికంగా ఉన్నదే! తూర్పుగోదావరి లోనే అమలాపురం సమీపంలోని పాశర్ పూడిలో బ్లో అవుట్ వ్యవహారం, అనంతరం “నగరం”లో గ్యాస్ లీక్ సంఘటన… అడపాదడపా మలికిపురం మండలంలోని చింతలమోరి, కేశవదాసుపాలెం వంటి ప్రాంతాల్లో గ్యాస్ లీక్ సంఘటనలు గోదావరి వాసులను నిత్యం ఏదో ఒక మూల బయపెడుతూనే ఉంటాయి. ఇదే క్రమంలో తాజాగా కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో అర్ధరాత్రి గ్యాస్ లీకేజీ వ్యవహారం కలకలం రేపింది.
స్థానిక టెకీ రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడంతో… విశాఖ మారణహోమం ఇంకా కళ్లముందు కదలాడుతున్న నేపథ్యంలో జనం ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.. సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. ఈ లోపు అదృష్టం కొద్దీ గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కంపెనీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారం అనంతరం అయినా ఈ రసాయన కంపెనీలు ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్య వచ్చిన తర్వాత కబుర్లు చెబుతూ, కనీర్లు కార్చేకంటే… సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అందరికీ శ్రేయస్కరం అని కంపెనీలు గుర్తించాలి! అలాకానిపక్షంలో భారీ మూల్యాలే చెల్లించుకోవాల్సి వస్తుందని చాలా సంఘటనలే రుజువు చేశాయి.
కాగా… దాదాపు నాలుగు వారాల క్రితం విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు! ఆ దుర్ఘటన జరిగిననాటి నుంచీ గ్యాస్ లీకేజీ పేరు వింటేనే ఏపీ ప్రజలు వణికిపోతున్నారు.