తన భద్రత విషయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఛానల్ తో మాట్లాడుతూ మంత్రి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకి ప్రాణహాని ఉందని, ఇకనుండి లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తన ప్రత్యర్థుల నుంచి రక్షణ కోసం గన్ వాడాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ భద్రత సరిగా లేకపోవడంపై అనుమానాలకు తావిస్తోందన్నారు. సొంత సెక్యూరిటీ సిబ్బందితో నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవల నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరిగిందని.. ఆ సమావేశంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ నేత కనిపించాడని చెప్పుకొచ్చారు.
తన చుట్టూ ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయన్నారు ఆనం రామ్ నారాయణరెడ్డి. తనపై రెక్కీ నిర్వహించిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించామని చెప్పారు ఆనం. తమకు ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఇకపై ఆయుధాలతో తిరిగే విషయమై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆనం.