ప్రకాశం బ్యారేజ్ కి ఏ మాత్రం వరద తగ్గలేదు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతోంది. మునేరు, వైరా, కటలేరు, నుంచి 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 6లక్షల 20 వేల క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 6లక్షల 12వేలు ఉంది. కృష్ణా ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాల్వలకు సాగునీటి అవసరాల మేరకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఇంకా వరద నీటి ముంపు లోనే విజయవాడలోని తారకరామ నగర్,భుపేష్ గుప్త నగర్, బాలాజీనగర్,రామలింగేశ్వర నగర్ ప్రాంత వాసులు ఉన్నారు. ఆ నిర్వాసితులు అందరూ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారు. పంట పొలాలు అన్నీ నీట మునిగాయి. ఇక తెనాలి డివిజన్ పరిధిలో లంక గ్రామాలకు కూడా వరద ముప్పు పొంచి ఉంది. వరద పెరుగుతున్న దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొల్లిపర మండలంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యటించారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.