అల్పపీడన ప్రభావంతో ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వానలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రహదారులు చెరువుల్లా మారాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల పలుచోట్ల వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షంతో జనజీవనం అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విశాఖ జ్ఞానాపురం పాత వంతెన వద్ద వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. కొన్ని చోట్ల వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. పాడేరు మండలం రాయిగడ్డ, పరదానిపుట్టు వద్ద మత్స్య గెడ్డ వాగు పొంగుతోంది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్రిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు అరకులో భారీగా వర్షాలు పడుతున్నాయి. డుంబ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్‌వేపై వర్షపునీరు ప్రవహిస్తోంది. మరమ్మతులో ఉన్న కాజ్‌వేపై వర్షపు నీటితో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ నేడు, రేపు సెలవు ప్రకటించారు.