భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం రోజున 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఇవాళ ఉదయానికి 25 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి.. 59 వేల 330 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరుకుంది.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 17283 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1065.30 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.