విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటర్ లాకింగ్ సిస్టం వైఫల్యం లేదని తెలిపారు.
విశాఖ-రాయగూడ ప్యాసింజర్ లోకో పైలట్ సిగ్నల్ ను గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. కాగా, విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 54 మంది గాయపడినట్లు ఆ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వారికి స్థానిక ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మృతి చెందిన వారి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరు మృతదేహాలు విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో.. మరో మృతదేహం మిమ్స్ ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు.. మిగతా 7 మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.