ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల కేటాయింపు విషయంలో సీఎం జగన్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చే పనికి మాలిన వారికి టికెట్లు ఇస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఎవ్వరికీ టికెట్ ఇవ్వాలన్నా వారి క్యారెక్టర్ కీలకం అని.. టీడీపీ నుంచి వస్తున్న వారికి క్యారెక్టర్ చూసి టికెట్ కేటాయించాలన్నారు.
అలా ఏ అర్హత చూడకుండానే టికెట్లు కేటాయిస్తే.. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని గుర్తు చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నారని వార్తలు వచ్చాయని.. జగన్ కాళ్లు పట్టుకోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే వారందరూ కోవర్టులేనని పేర్కొన్నారు. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలలో టీడీపీ నుంచి కోవర్టులుగా వచ్చి టికెట్లు అడుగుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు.