జెమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలన్నారు. “ఒకే దేశం – ఒకే ఎన్నిక” విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమన్నారు.
ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏని గెలిపించారని చెప్పుకొచ్చారు. హర్యానాలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల సమయస్ఫూర్తి అద్భుతమని తెలిపారు. ఉదయం ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపానన్నారు చంద్రబాబు. జమ్మూ కశ్మీరులో బలమైన పార్టీగా బీజేపీ అవతరించిందని.. చెప్పే విధానం సరిగ్గా ఉండి, చేసేది మంచైనప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ లలో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే వస్తాయని విశ్వసిస్తున్నానన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తున్నారని అన్నారు చంద్రబాబు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలం పెరిగిందన్నారు. హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్ ఎన్నికల్లో ఫలితాలే దీనికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.