తిరుమల క్షేత్రంలో ఎవరైనా ఆచారాలను పాటించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఎన్నడూ సతీసమేతంగా తిరుమలకు వెళ్లిన దాఖలాలు లేవని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు శ్రీవారి పట్టు వస్త్రాల సమర్పణలోనూ నిబంధనలు తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు.
జగన్ ను బైబిల్ చదవద్దని ఎవ్వరూ అనలేదని పేర్కొన్నారు. ప్రతీ మనిషికి మతం అనేది ఓ విశ్వాసం, నమ్మకం అని హితవు పలికారు. తాము ఒకవేళ చర్చి, మసీదుకు వెళ్తే.. అక్కడి ాచారాలను కూడా పాటిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా తిరుమలలోనూ కొన్ని ఆచారాలు ఉన్నాయని.. వాటిని పాటించాల్సిన బాధ్యత అందరి పై ఉందని తెలిపారు. హిందూ మతం గురించి జగన్ ప్రశ్నిస్తున్నారని.. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చేందుకు సమస్య ఏంటో ఆయనకే తెలియాలన్నారు.