వైసీపీ దెబ్బతో విజయనగరం రాజావారికి దిమ్మతిరుగుతోందా ? తన పొలిటికల్ ఇమేజ్ సహా తన అనుభవం కూడా ఆయనకు ఇప్పుడు అక్కరకు రావడం లేదా ? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ తరఫున కొన్ని దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్నారు గజపతుల వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు చక్రం తిప్పుతున్నారు. తనకు తిరుగులేదని అన్నట్టుగా జిల్లాలో రాజకీయాలు నడిపారు. పార్టీలోనూ పట్టు సాధించారు. ఈ క్రమంలోనే 2014లో ఎంపీగా గెలిచిన ఆయన తర్వాత కేంద్రంలో మంత్రిగా బెర్త్ పట్టారు. ఆ తర్వాత టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడంతో ఆయన మంత్రి పదవి వదులుకున్నారు.
గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ సునామీలో ఈయన ఓడిపోయారు. నిజానికి గత ఏడాది ఎన్నికల్లో తన వారసురాలిగా తన కుమార్తెను రంగంలోకి దింపారు.విజయనగరం ఎంపీగా పోటీ చేసిన అశోక్, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమార్తె అతిథి ఇద్దరూ ఓడిపోయారు. అయితే, తర్వాత కాలం లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌ను కేంద్రంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ ఎదురు దాడి చేయలేదు కానీ.. ఎక్కడ రాజుగారిని దెబ్బకొట్టాలో అక్కడ బలంగా కొట్టింది. కొన్ని దశాబ్దాలుగా మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా (ఆయన కుటుంబాలకు చెందిన వేలాది ఎకరాల ఆస్తులు. గుళ్ల చైర్మన్) ఉన్న అశోక్ గజపతిని వ్యూహాత్మకంగా పక్కన పెట్టింది. అదే సమయంలో ఆయన అన్నగారి కుమార్తె సంచయితను ఈ పదవిలో కూర్చోబెట్టారు.
నిజానికి ఇది అశోక్ గజపతి రాజుకు పరువుతో కూడిన వ్యవహారం. అయినప్పటికీ.. ఎక్కడా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం గజపతిరాజును ఇరికించేసింది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. జగన్ మాత్రం అశోక్‌ను ఈ పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తప్పించేశారు. ఇంకో పక్క, విజయనగరంలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా చలామణి అవుతున్నారు. టీడీపీని నామ రూపాలు లేకుండా చేసే క్రమంలో ఆయన చిన్నా చితకా నాయకులను కూడా పార్టీలోకి తీసుకుంటున్నా రు. దీంతో అటుపార్టీలోనూ గజపతి రాజు హవా తగ్గిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక, ఫ్యామిలీ పరంగానూ ఆయన హవా తగ్గిపోయింది. మాన్సాస్‌పై న్యాయ పోరాటం జరుగుతున్నా.. ఇప్పటికే తన అన్న కుమార్తె రంగంలోకి దిగిపోవడంతో రేపు కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి. మొత్తానికి ఇప్పటికే ప్రజాతీర్పులో పరాభవం ఎదురైన అశోక్.. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా గత నాలుగు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అశోకుడి ప్రభావానికి దాదాపు తెరపడినట్టే అనుకోవాలి.